త్యాగాలతోనే స్వాతంత్య్రం
సంక్షేమ పథకాలతోనే జిల్లా అభివృద్ధి
బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు
కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): త్యాగాలతో స్వాతంత్య్రం సిద్ధించిందని, అమరుల త్యాగాల తోనే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వి హనుమంతరావు అన్నారు. శనివారం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల తోనే జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి పేద వాడి జీవితంలో వెలుగులు నింపడమే నిజమైన స్వాతంత్య్రం అన్నారు.
అంతకుముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులను ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు. వివిధ ప్రభుత్వ పాఠశాల ల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. చిన్నారులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, అదనపు కలెక్టర్ లు విక్టర్, ఎన్ వై గిరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.






