15 August, 2026 | 6:03 PM

గౌరవెల్లికి ఎన్జీటీ గండం.. నీళ్ల కోసం రైతుల ఎదురుచూపులు!

15-08-2026 05:22 PM

బొమ్మలు, పార్కులు కాదు.. గౌరవెల్లి నింపి సాగు, తాగునీటి సమస్య తీర్చాలి: మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్

హుస్నాబాద్, ఆగస్టు 15 : గౌరవెల్లి రిజర్వాయర్‌పై(Gauravelli Reservoir) ఉన్న ఎన్జీటీ కేసును పరిష్కరించి ప్రాజెక్టులో నీళ్లు నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ విమర్శించారు. శనివారం హుస్నాబాద్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్జీటీ కేసును పరిష్కరించలేకపోయారని అన్నారు. కరువు పరిస్థితులు పొంచి ఉన్న నేపథ్యంలో గౌరవెల్లిని వెంటనే నింపితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీటి భరోసా కలుగుతుందని పేర్కొన్నారు. “బొమ్మలు, పార్కులు ప్రజల కడుపులు నింపవు.. పొలాలకు నీళ్లు అందించడమే అసలు అభివృద్ధి” అని వ్యాఖ్యానించారు.అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్ మండలాలకు సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా గౌరవెల్లిని నింపడంతో పాటు ఇతర సాగునీటి మార్గాల ద్వారా ఆయా మండలాలకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తాగునీటి సమస్యపై ప్రజలు చేపట్టే ఆందోళనలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.