7 May, 2026 | 2:32 AM

విదేశాలు, టూరిస్ట్ ప్రదేశాలకు ట్రిప్పుల పేరుతో మోసం

07-05-2026 01:32 AM

ముషీరాబాద్, మే 6 (విజయక్రాంతి): విదేశాలకు ఇతర టూరిస్టు ప్రదేశాలకు ట్రిప్పుల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిపై దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. దోమలగూడ సిఐ ఎండి. అంజద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం... నాగోల్ బండ్లగూడకు చెందిన పరమేశ్వరెడ్డి అనే వ్యక్తి గోవా ట్రిప్పుకోసం ఫిబ్రవరి 21న జస్ట్ డయల్ యాప్‌లో సర్చ్ చేయగా హిమాయత్‌నగర్ అర్చన ట్రావెల్స్ కార్యాలయం నుంచి పరమేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి తమ ఏజేన్సీ గోవా ట్రిప్పుకోసం ప్రత్యేక ఆఫర్లను అందజేస్తున్నట్లు వారు తెలియజేశారు.

ఆరుగురికి కలిపి రూ.55 వేలు ఖర్చు అవుతుందని తెలుపగా బాదితుడు పరమేశ్వర్‌రెడ్డి తన ఎస్బీఐ క్రెడిట్ కార్డునుంచి రూ.55 వేలను చెల్లించగా సదరు ట్రావెల్స్ యజమాని మార్చి 23న గోవా ట్రిప్ బయలు దేరుతుందని రెడీ ఉండమని చెప్పారు.

దాని తరువాత ఫ్లైట్ టిక్కెట్స్ ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన పరమేశ్వర్ రెడ్డి హిమాయత్ నగర్‌లోని ఆర్చన ట్రావెల్స్ కార్యాలయానికి వెళ్లి యాజమాని బోజారెడ్డిని నిలదీయగా ఇదిగో,  అదిగో అంటూ కాలయాపన చేశారు. దీంతో తాను మోసపో యానని గ్రహించి దోమలగూడ పోలీస్ స్టేషన్లో  పరమేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయగా పోలీసులు అర్చన ట్రావెల్స్ యాజ మానిపై కేసు నమోదు చేస్తున్నట్లు సిఐ అంజద్ అలీ తెలిపారు.