24 August, 2026 | 2:49 PM

బల్మూర్‌లో రహదారి పనులకు శంకుస్థాపన

24-08-2026 01:41 PM

మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి చేతుల మీదుగా ప్రారంభం

అచ్చంపేట ఆగస్టు24 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్‌లో రూ.146.71 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు రహదారి పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. వనపర్తి-1 ప్యాకేజీ కింద అచ్చంపేట ఫేజ్-1లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ ఎం ఏ ) విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు.

రూ.32.99 కోట్లతో అమ్రాబాద్–తొల్పలపల్లి రహదారి పదర, వాంకేశ్వరం, చిట్లముకుంట, ఉడిమిల్ల, ఇప్పలపల్లి గ్రామాల మీదుగా 34/200 కిలోమీటర్ల వరకు రహదారిని బలోపేతం చేయనున్నారు. రూ.35.71 కోట్లతో బల్మూర్–నాగర్‌ కర్నూల్ పీడబ్ల్యూడీ రహదారి: బల్మూర్, గోడల్, తుమ్మన్‌పేట గ్రామాల మీదుగా రహదారిని రెండు లేన్లుగా విస్తరించనున్నారు. రూ.78.01 కోట్లతో అచ్చంపేట–రాకొండ రహదారి: ఉప్పునుంతల, మొల్గర, పెద్దాపూర్, మామిళ్లపల్లి, రాకొండ గ్రామాల మీదుగా రహదారిని రెండు లేన్లుగా విస్తరించనున్నారు. వారితోపాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవి తదితర ముఖ్య నేతలు ఉన్నారు.