24 August, 2026 | 3:31 PM

కళాశాలలో అధ్యాపకులు కావాలంటూ ఆర్డీవో కార్యాలయం ముట్టడి

24-08-2026 02:25 PM

బాన్సువాడ, ఆగస్టు 24 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కళాశాలలో అధ్యాపకులు కావాలంటూ విద్యార్థులు సోమవారం ఆర్డీవో కార్యాలయం ముట్టడి ఆందోళన చేపట్టారు.సివిక్స్, జువాలజీ సబ్జెక్టులకు సరైన బోధన అందడం లేదని ఆందోళన చేపట్టారు.కళాశాల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేసి, కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత ఏడాది కాలంగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని విద్యార్థులు ఆరోపించారు. సివిక్స్,జువాలజీకి వెంటనే అధ్యాపకులను నియమించి రెగ్యులర్‌గా,అర్థమయ్యేలా తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సరైన బోధన లేకపోవడంతో సివిక్స్‌లో విద్యార్థులు అధిక సంఖ్యలో ఫెయిల్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత కొన్నేళ్లుగా పలువురు అధ్యాపకులు లేకపోవడంతో ప్రతి ఏటా అనేక మంది విద్యార్థులు ఇంటర్‌లో విఫలమవుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ముఖ్యంగా సివిక్స్, జువాలజీ సబ్జెక్టులకు అధ్యాపకులను వెంటనే నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తరగతులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలని కోరారు. జువాలజీ లెక్చరర్ రెండేళ్లుగా లేకపోయినా బైపీసీ విభాగంలో అడ్మిషన్లు తీసుకోవడం వల్ల తమ భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి అధ్యాపకులను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు.