స్మశాన వాటికకు శాశ్వత దారి ఏర్పాటు చేయాలి
ఆక్రమణకు గురైన డొంకదారిని సర్వే చేసి పంచాయతీకి అప్పగించాలి
అశ్వాపురం, ఆగస్టు 24(విజయక్రాంతి): అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని నూతన స్మశాన వాటికకు శాశ్వత రహదారి ఏర్పాటు చేయాలని కోరుతూ సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఉపసర్పంచ్ తుళ్లూరి ప్రకాష్‌రావు ప్రజావాణిలో తహసీల్దార్ సూర్యప్రకాష్‌కు వినతిపత్రం సమర్పించారు. నూతన స్మశాన వాటికకు సరైన రహదారి లేకపోవడంతో జగ్జీవన్‌రామ్ కాలనీ వీధుల గుండా శవాలను తీసుకెళ్లాల్సి వస్తోందని, దీంతో స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
మల్లమ్మ సెంటర్ నుంచి చెరువు కట్ట వరకు గతంలో ఉన్న డొంకదారి ఆక్రమణకు గురైందని, దీనిపై పలుమార్లు అధికారులకు వినతులు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. గత మే నెలలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందించగా దారిని సర్వే చేసి పంచాయతీకి అప్పగిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. వెంటనే సర్వే నిర్వహించి దారిని గ్రామపంచాయతీకి అప్పగిస్తే పంచాయతీ నిధులతో రహదారి నిర్మించి నూతన స్మశాన వాటికకు శాశ్వత మార్గం ఏర్పాటు చేస్తామని సర్పంచ్ బానోత్ సదర్ లాల్ తెలిపారు.






