24 August, 2026 | 3:34 PM

ఆయిల్‌పామ్‌ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

24-08-2026 02:28 PM

మహదేవపూర్‌, ఆగస్టు 24 (విజయ క్రాంతి): ఆయిల్‌పామ్‌ రైతుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఆయిల్‌పామ్‌ రైతుల సంక్షేమ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు పొల్నేని రాజేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. మహదేవపూర్‌ మండలం అంబటిపల్లిలో సోమవారం సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రైతుల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి 200 మందికి పైగా రైతులు హాజరయ్యారు. రైతు లింగంపల్లి శ్రీనివాసరావుకు చెందిన 40 ఎకరాల ఆయిల్‌పామ్‌ తోటలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నీటి సమస్యలు, ఎరువుల కొరత, పంట సంరక్షణ, గెలల కోత, రవాణా, యంత్ర పరికరాల లభ్యత, ఆధునిక సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలపై రైతులు చర్చించారు. అవసరమైన యంత్రాలు, ఎరువులు, పంట సంరక్షణ ఉత్పత్తులు, నీటిపారుదల సాంకేతికతను అందించే సంస్థలను రైతులకు చేరువ చేయాలని నిర్ణయించారు.

రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాజేశ్వర్‌రావు అన్నారు. ప్రతి మండలం, గ్రామంలోని ఆయిల్‌పామ్‌ రైతులను సంఘంతో అనుసంధానం చేస్తామని తెలిపారు. మండల స్థాయి కమిటీలు లేని ప్రాంతాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రతినిధులు, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. సమావేశాన్ని విజయవంతం చేసిన రైతులు, కమిటీ సభ్యులు, ఆతిథ్య రైతు లింగంపల్లి శ్రీనివాసరావుకు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.