17 August, 2026 | 3:36 AM

టీఎంసీ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ ఆత్మహత్య

17-08-2026 01:32 AM
  1. అవినీతికి పాల్పడలేదని పార్టీ కార్యాలయంలో సూసైడ్ నోట్ 
  2. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
  3. రాజకీయాల్లోకి రావటమే పొరపాటైందని ఆవేదన
  4. బంగాల్ బీర్భూమ్‌లో ఘటన

కోల్‌కతా, ఆగస్టు 16: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సన్నిహితుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆశిష్ బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం వేకువజామున బీర్భూమ్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఇంటికి సమీపంలోనే పార్టీ కార్యాలయం ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తృణమూల్ నేత మృతి విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం వద్దకు తరలివచ్చారు.రాంపూర్హాట్ నుంచి ఆశిష్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001 నుంచి 2006 వరకు 25 ఏళ్లపాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

బెంగాల్ విద్యా, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2021లో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత ద్రువ్ సాహా చేతిలో ఓటమి పాలయ్యారు. కార్యాలయంలో ఆయన మృతికి సంబంధించి సూసైడ్ నోట్ లభ్యమైంది. తన జీవితంలో ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి తప్పూ చేయలేదని ఆశిష్ లేఖలో పేర్కొన్నారు. తారాపీఠ్ రాంపూర్హాట్ అథారిటీకి సంబంధించిన అవకతవకల్లో తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాటితో తనకు సంబంధం లేదన్నారు.