calender_icon.png 5 February, 2026 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎస్‌ఐబీ డీఎస్పీకి షాక్!

05-02-2026 01:54:28 AM

  1. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావుపై వేటు

సీఐగా డిమోషన్ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించింది. గతంలో ఆయనకు కల్పించిన యాక్సిలరేటెడ్ ప్రమోషన్‌ను రద్దు చేస్తూ, ఆయన్ను డీఎస్పీ ర్యాంక్ నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి తగ్గిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2007 బ్యాచ్‌కు చెందిన ప్రణీత్‌రావు, గత ప్రభుత్వ హయాం లో ఎస్‌ఐబీలో కీలకంగా వ్యవహరించారు.

అప్పట్లో ఆయన పనితీరు ఆధారంగా ప్రభుత్వం యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చి డీఎస్పీని చేసింది. అయితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడటం, ఆయన అరెస్ట్ కావడంతో 2024 నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల ఫోన్లను ప్రణీత్‌రావు అక్రమంగా ట్యాప్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వం మారాక, ఈ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు ఎస్‌ఐబీ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఉన్న కీలక డేటాను, హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారని సిట్ దర్యాప్తులో తేలింది.

అదనపు ఎస్పీ రమేష్ ఫిర్యా దు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేయగా, 2024 మార్చి 13న రాజ న్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో ప్రణీత్‌రావును అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారిస్తున్న దర్యాప్తు బృందం ప్రణీత్ రా వుతో పాటు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావును పలుమార్లు విచారించింది. డిజిటల్ సాక్ష్యాల ధ్వంసం, అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు పాత్రపై బలమైన సాక్ష్యాలు లభించడంతోనే ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.