నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు: మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
కాఠ్మండు: నేపాల్ మాజీ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ అరెస్ట్(KP Sharma Oli Arrested) అయ్యారు. ఓలీపై మానవహక్కుల ఉల్లంఘన అభియోగాలు నమోదు చేశారు. గత ఏడాది దేశాన్ని కుదిపేసిన 'జెన్ జీ' ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని ఆయన ఆరోపణలున్నాయి. నిరసనకారులపై బలప్రయోగంతో మానవహక్కులు ఉల్లంఘించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఓలీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.
బాలేంద్ర షా(Balendra Shah) నేపాల్ నూతన ప్రధానిగా నిన్ననే బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఓలీ అరెస్టుతో నేపాల్ లో రాజకీయ ప్రకంపనలు వచ్చాయి. పోలీసుల ప్రకారం, CPN-UML అధ్యక్షుడైన ఓలిని కాఠ్మండుకు తూర్పున 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తపూర్ జిల్లాలోని గుండు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. భక్తపూర్ జిల్లాలోని సూర్యవినాయక్ మున్సిపాలిటీ పరిధిలో గల కతుంజేలోని తన నివాసం నుండి, మాజీ హోం మంత్రి, నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రమేష్ లేఖక్ కూడా అరెస్టు చేయబడ్డారని పోలీసులు తెలిపారు.




