10 June, 2026 | 9:54 AM

మోహన్‌నగర్ ప్రజానివాస్‌లో సమస్యలపై మాజీ కార్పొరేటర్ పవన్ కుమార్ ఆరా

10-06-2026 12:43 AM

నీటి కొరత, డ్రైనేజీ, వీధిదీపాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా

నాగోల్, జూన్ 9 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పేర్కొన్నారు. మోహన్ నగర్ ప్రజా నివాస్ ఫేజ్-1 కాలనీలో ఆయన పర్యటించి స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి కొరత, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల లేమి, పారిశుద్ధ్య నిర్వహణలో ఉన్న లోపాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ముఖ్యంగా తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే బోర్వెల్ ఏర్పాటు చేయాలని కోరారు. స్థానికుల సమస్యలను ఓపికగా విన్న పవన్ కుమార్, పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ సహకారంతో బోర్వెల్ ఏర్పాటు చేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అలాగే ఇతర మౌలిక వసతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ప్రజలతో నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.