కవ్వాల్ టైగర్ రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌లో ట్రైనీ ఐఏఎస్‌లు
జన్నారం, జూన్ 9: మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్లో మంగళవారం 2025 బ్యాచ్కు చెందిన శిక్షణ(ట్రేనీ) ఐఏఎస్ అధికారుల బృందం పర్యటించింది. ఈ బృందం అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, ఎకో టూరిజం ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించింది. తాళ్లపేట రేంజ్ పరిధిలోని మల్యాల వాచ్ టవర్ నుంచి అడవిని, వన్యప్రాణులను వీక్షించారు.
జన్నారం రేంజ్ పరిధిలోని బైసన్ కుంట, నీలుగాయి, సోలార్ కుంటలను సందర్శించి, అక్కడ వన్యప్రాణుల కోసం కల్పిస్తున్న తాగునీటి వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ట్రేనీ ఐఏఎస్ అధికారులు సచిన్ బసవరాజు, ఇ.సాయిశివాని, సురేష్ పామూరి, పి.హరిప్రసాద్ ల వెంట స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్, దండేపల్లి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పి.రాము, ఫారెస్ట్ సెక్షన్, బీట్ అధికారులు బి భోజనాయక్, శ్రీకాంత్, అజీజ్ అటవీ శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.






