10 June, 2026 | 10:58 PM

ముందు జీతాలివ్వు

10-06-2026 01:10 AM
  1. అంగన్‌వాడీల కష్టాలు కనిపించడం లేదా? 
  2. ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుంది 
  3. మీ పాలనను ప్రజలు ఛీ కొడుతుండ్రు
  4. ఇప్పటికైనా కళ్లు తెరవండి 
  5. మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి) : మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతు న్న రేవంత్ రెడ్డి.. ముందు అంగన్‌వాడీ ఉద్యోగులకు జీతాలు చెల్లించి, మహిళల పట్ల నీకున్న గౌరవా న్ని నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావువు హితవు పలికారు. 2 నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62 వేల అంగన్‌వాడీల కష్టాలు మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్‌వా డీలను వేధిస్తున్న కాం గ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుతుందన్నారు. మహిళా మం త్రిగా ఉన్న సీతక్క సాటి మహిళల గోస అర్థం చేసుకోకపోవ డం శోచనీయమని విమర్శించారు. అంగన్‌వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ వారు వర్కర్లు కాదని, అంగన్‌వాడీ టీచర్లు అని పోస్టు ను ఉన్నతీకరించి, వారి గౌరవాన్ని పెంచారని గుర్తు చేశారు.

2014 నాటికి అంగన్‌వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేదన్నారు. కానీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్ల వేతనం రూ.7,800కు పెంచారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.18వేలకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారని, రెండున్నర ఏళ్లు గడిచినా హామీకి అమలుకు నోచలేదని విమర్శించారు.

ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు.    సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్‌వాడీల పట్ల పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.  అంగన్‌వాడీల పెండింగ్ వేతనాలు, అప్‌గ్రేడ్ చేసిన మినీ అంగన్‌వాడీల పెండింగ్, పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు.