75 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం
- వానాకాలం, యాసంగిలో 147 లక్షల టన్నులు సేకరించాం
- ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్
- కేంద్రం లక్ష్యాలను తగ్గించినా రైతుకు ఇబ్బంది కలగనివ్వం
- తడిసిన ధాన్యాన్ని కూడా కొన్నాం
- సేకరణ పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు
- పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వర కు 75 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని, వానాకాలం, యాసంగి సీజన్ లలో ఇప్పటి వరకు 147 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం సేకరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. తెలంగా ణలో ఇన్ని టన్నుల ధాన్యం సేకరణ దేశంలోనే సరికొత్త రికార్డు అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.35,077 వేల కోట్లను 25.20 లక్షల రైతు లావాదేవీలు విజయవంతంగా పూర్తయ్యాయని మంత్రి వివరించారు.
మంగళవారం సచివాలయంలో మం త్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మె ల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణకు రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులకు ఎలాంటి ఇబ్బం దిలేకుండా స్థానికంగానే ధాన్యం కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 65.91 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. 52 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం చెప్పిందని, తాము 75 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని వెల్లడించారు. ఈ కొనుగోళ్ల విలువ రూ.17,917 కోట్లకు చేరుకుందని చెప్పారు. మరో లక్ష టన్నులు వారంలో వస్తాయని అన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వరిలో 61 శాతం తెలంగాణ నుంచే అని తెలిపారు.
దేశంలో రెండో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 4,850 కేంద్రాలు మాత్రమే ఉండగా తెలంగాణలో వాటికంటే 1.7 రెట్లు ఎక్కువ కేంద్రాలు పనిచేశాయని చెప్పారు. గత రెండు సంవత్సరాల్లోనే 3 వేలకు కుపైగా కొత్త కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో యాసంగి ధాన్యం ఉత్పత్తి 28 శాతం పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు లక్ష్యాన్ని 79 లక్షల టన్నుల నుంచి 52 లక్షల టన్నులకు తగ్గించిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.
పక్క రాష్ట్రమైన ఏపీ ప్రభుత్వం 25 లక్షల టన్నుల వరి మాత్రమే కొనుగోలు చేసిందని వివరించారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో అదనంగా 57 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.16,645 కోట్ల మద్దతు ధర చెల్లించిందన్నారు.
గన్నీ సంచుల కొరత లేదు
ధాన్యం కొనుగోళ్ల కోసం మొత్తం 20.86 కోట్ల గన్నీ సంచులను సిద్ధం చేశామని, వాటిలో 18.75 కోట్ల సంచులను వినియోగించినప్పటికీ ప్రస్తుతం 2.11 కోట్ల సంచులు నిల్వలో ఉన్నాయని తెలిపారు. గన్నీ సంచుల కొరత లేదని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో తడిసిన 12,557 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రత్యేక చర్యల ద్వారా బాయిల్ రైస్ మిల్లులకు తరలించి రైతులను ఆదుకున్నామని మంత్రి తెలిపారు. ఆ ధాన్యానికి 12 గంటల వ్యవధిలోనే మద్దతు ధర చెల్లించి రైతులను నష్టాల నుంచి కాపాడామని చెప్పారు.
మా కంటే బీఆర్‌ఎస్, బీజేపీ తక్కువే
ధాన్యం కొనుగోలు ద్వారా మహిళా సంఘాలు, పీఏసీఎస్‌లను బలపరుస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. మహిళా సంఘాల ద్వారా 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయించి వారికి రూ.171 కోట్లు కమిషన్ ఇచ్చామని తెలిపారు. పీఏసీల ద్వారా 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోల్లు జరగాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ కన్నా తక్కువ ధాన్యం కొనుగోలు సేకరించిందని, బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా ఇంత వరి సేకరణ చేయలేదని అన్నారు.
పదేళ్లలో ధాన్యం కొనగోళ్లలో బీఆర్‌ఎస్ రైతలకు రూ.1.35 లక్షల కోట్లు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో రూ.లక్ష కోట్లు ఇచ్చిందని, మళ్లీ తమపైనే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.- ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా సాగుతుంటే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగా రైతుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రాల యాత్రల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుని కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు.






