రేవంత్‌రెడ్డే గులాం
- సీఎం పదవి నిలుపుకునేందుకు నెలనెలా సోనియా కుటుంబానికి ముడుపులు
- ప్రాజెక్టులు ఆయనకు ఏటీఎంలు
- మా నాయకులను విమర్శిస్తే సహించం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
ఆలేరు, జూన్ 9 (విజయక్రాంతి) : సోనియాగాంధీ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి గులాముగా మారాడని, దాని లో భాగంగానే తన పదవిని నిలుపుకోవడానికి నెలనెలా ముడుపులు చెల్లిస్తున్నా డని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు విమర్శించారు. మంగళవారం యాదగిరిగుట్ట సమీపంలోని సురేంద్రపురి ఆర్యవైశ్య సత్రంలో జరిగిన బీజేపీ యాదాద్రి జిల్లాస్థాయి ప్రశిక్షణ మహాబియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నోరుందని బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీలను అమలు చేయ కుండా గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మూసీ ప్రక్షాళన రెండో ఏటీఎం అయితే పాలమూరు రంగారెడ్డి మొదటి ఏటీఎంగా మారిందన్నారు.
తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, ఈ ముసుగులో లక్షల కోట్ల అంచనాలతో అక్రమ కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో లక్షల కోట్ల జాతీయ రహదారులు, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు సెంట్రల్ యూనివర్సిటీ, ఏయిమ్స్, వరంగల్ టెక్స్‌టైల్స్ పార్క్ కేంద్రం ఇచ్చినా కాంగ్రెస్‌కు కనపడటం లేద న్నారు. ఎంఎంటీఎస్‌కు కేంద్రమే నిధులు సమకూరుస్తుందని స్పష్టం చేశారు.
ఆర్‌ఆర్‌ఆర్‌కు భూసేకరణ చేయలేక, కేంద్రంపై నిందలు సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.2,500 కోట్లు కేటాయింపులు జరిపిందన్నారు. హైదరాబాద్ మెట్రోకు రూ.2 వేల కోట్లు రుణం మంజూరీ సైతం కేంద్రమే చేసిందన్నారు. మెట్రో విస్తరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీస అవగాహన లేకపోవడం వల్లే ఈ ఏడాది ధాన్యం దిగుబడిని సరిగ్గా అంచనా వేయలేకపోయిందని, కేంద్రానికి సేకరణపై సరైన సమర్పించలేదని ధ్వజమెతారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు మాట తప్పుతోందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కాపాడేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విచారణపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.






