మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
- హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస
- తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, పలువురు ప్రముఖులు సంతాపం
- నేడు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) కన్నుమూశారు. నెల రోజులుగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
భాస్కరరావు కుమారుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. గురువారం నాదెం డ్ల భాస్కర రావు అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుం బ సభ్యులు తెలిపారు. 1978లో కాంగ్రెస్ నుం చి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984 లో ౩౩ రోజులు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిబాధ్యతలు నిర్వర్తించారు.
1935జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీలో అర్ధ దశాబ్దానికి పైగా సేవలందించారు. ఎన్టీఆర్‌తో కలిసి టీడీపీని ఏర్పాటు చేశారు. 1982 ఎన్నికల్లో ఎన్టీఆర్‌తో కలిసి టీడీపీ విజయంతో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో విభేదించి, సొంత పార్టీ పెట్టుకున్నారు. ఎన్టీఆర్ 1985 మార్చిలో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్.
ఈ ఎన్నికల్లో సొంతంగా నాదెండ్ల భాస్కర్‌రావు పెట్టిన తెలుగునాడు పార్టీ ఘోర ఓటమి పాలైంది. 1984 ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా వ్యవహరించారు. 1978 నుంచి 89 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1989 ఎన్నికల్లో తెనాలి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందగా 1994 ఎన్నికల్లో మళ్లీ తెనాలి నుంచి పోటీచేసి ఓడిపోయారు. దీంతో వెంట నే ఆయన నియోజకవర్గాన్ని మార్చేసి.. 1998 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.
నాదెండ్ల భాస్కరరావు 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఆయన క్రీయాశీలక రాజకీయాలకు దూరం గా ఉన్నారు. నాదెండ్ల భాస్కరరావు రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు మనోహర్ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా, ప్రస్తుత ఏపీ క్యాబినెట్‌లో జనసేన నుంచి మంత్రిగా వ్యవహరిస్తున్నారు.






