16 March, 2026 | 8:21 PM

సాగులో ఉన్న పోడు భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి

16-03-2026 07:11 PM

విద్యుత్ కనెక్షన్లకు అటవీశాఖ క్లియరెన్స్ ఇవ్వాలి

అటవీశాఖ మొండివైఖరి వీడి రైతులకు వెసులుబాటు కల్పించాలి

డిఎఫ్ఓ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో పోడు రైతుల రాస్తారోఖో

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): లక్ష్మీదేవిపల్లి మండలంలో సాగులో ఉన్న పోడు భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించి, రైతులు సాఫీగా సాగుచేసుకునే వెసులుబాటు కల్పించాలని సిపిఐ మండల కార్యదర్శి దీటి లక్ష్మీపతి డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో పోడు రైతులు డిఎఫ్ఓ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోఖో నిర్వహించి తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు మంజూరు చేసిన నేపథ్యంలో, ఆ భూముల్లో సాగుకు అవసరమైన విద్యుత్ కనెక్షన్లు పొందేందుకు అటవీశాఖ అధికారులు సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, అటవీశాఖ నుంచి సాంకేతికపరమైన క్లియరెన్స్ అందకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న రైతుల పరిస్థితిని మానవీయ కోణంలో ఆలోచించి, తక్షణమే అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు విన్నవించారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి, అటవీశాఖ అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనంతరం డిమాండ్ల వినతీపత్రాన్ని డిఎఫ్ఓకు అందించారు.  ఈ కార్యక్రమంలో నాయకులు, సర్పంచులు జలీల్ పాషా, లింగయ్య, తాటి లక్ష్మణ్, రాంబాబు, ఈసం కృష్ణ, కారం నరేష్, జి. కనకరాజు తదితరులు పాల్గొన్నారు.