25 July, 2026 | 1:49 AM

ముచ్చటగా మూడో సారి!

25-07-2026 12:29 AM

డింపుల్ హయతి.. కేవలం రవితేజతో మాత్రమే హీరోయిన్‌గా నటించింది. ఆయన తప్ప తెలుగు ఇండస్ట్రీకి చెందిన పెద్ద హీరోల సరసన ఇప్పటిదాకా నటించలేదు. అయితే, ప్రస్తుతం శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అప్పట్లో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో కథానాయకిగా నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి, వెళ్లిపోయింది. ఇదిలావుంటే, ఇప్పుడు మూడోసారి రవితేజతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది డింపుల్.

రవితేజ ప్రస్తుతం ‘ఇరుముడి’ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే విభిన్నమైన కథనాలు, ప్రత్యేకమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ.. రవితేజ ఎనర్జీకి తగ్గట్టు ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఈ చిత్రంలోనే కథానాయికగా డింపుల్ హయతి పేరు ఖరారైనట్టు సమాచారం.

ఇంతకుముందు ‘కిలాడీ’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాల్లో రవితేజతో జోడీ కట్టిన డింపుల్ ఇప్పుడు మరోసారి ఆయనతో స్క్రీన్ పంచుకోనుంది. ఒకే హీరోతో వరుసగా మూడోసారి కలిసి నటించడమనేది హీరోయిన్లకు అరుదుగా దక్కే అవకాశం. అందుకే ఈ హ్యాట్రిక్ కాంబోపై ప్రస్తుతం ఇండస్ట్రీల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.