calender_icon.png 14 February, 2026 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశు మందిర్‌లో అమ్మానాన్నలకు పాదపూజ

14-02-2026 05:14:32 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫిబ్రవరి 14ను పురస్కరించుకుని అమ్మానాన్నల పాదపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జంబోజు తిరుపతాచార్యుల ఆధ్వర్యంలో గణపతి పూజ, కలశ పూజలతో ప్రారంభించి, అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలను కడిగి పసుపు, కుంకుమ రాసి పూలదండలు వేసి నమస్కరించారు.

తల్లిదండ్రులు పిల్లలకు అక్షింతలు వేసి ఆశీర్వదించగా, పిల్లలను దగ్గరకు తీసుకొని ప్రేమతో గుండెలకు హత్తుకున్నారు. ఈ సందర్భంగా పోషకులు డాక్టర్ కళ్యాణి మాట్లాడుతూ పిల్లలకు చక్కటి సంస్కారాలు అందిస్తున్న ఏకైక విద్యాసంస్థలు సరస్వతీ శిశు మందిరాలేనని పేర్కొన్నారు. పోషకులు కూడా తమ తల్లిదండ్రులను గౌరవించాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి రాథోడ్ సుభాష్ మాట్లాడుతూ విద్యతో పాటు సంస్కారాలను నేటి తరానికి అందిస్తున్న సరస్వతీ శిశు మందిరాలను, ఆచార్యులను అభినందించారు.

ప్రైవేటు పాఠశాలల సంఘం  జిల్లా అధ్యక్షులు దేవ భూషణం మాట్లాడుతూ పిల్లలు భక్తిశ్రద్ధలతో పాదపూజ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమ వక్త దహెగాం గోవిందరావు మాట్లాడుతూ సరస్వతీ శిశు మందిరాల్లో చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను బోధిస్తున్నామని, పోషకుల కోరిక మేరకు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలను నిర్వహిస్తున్నామని తెలిపారు.సమితి అధ్యక్షులు భోనగిరి సతీష్ బాబు మాట్లాడుతూ తల్లిదండ్రుల పెంపకమే పిల్లల భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నరేంద్ర మోదీ తన ప్రతి పుట్టినరోజున తల్లిని దర్శించి పాదనమస్కారం చేసి ఆశీస్సులు పొందుతారని ఉదాహరణగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి హనుమాండ్ల రాజన్న, ఉపాధ్యక్షులు వేణుగోపాల్, కార్యదర్శులు నాగుల శ్రీనివాస్, భోగ మధుకర్, సభ్యులు కాండ్రే విశాల్, కల్లూరి సంతోష్, జంజిరాల శ్రీనివాస్ , రాధాకృష్ణ చారి , శ్రీనివాస్, చిప్ప రమాదేవి, కల్లూరు వైష్ణవి, బోనగిరి మంజూష, ఆచార్యులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.