12 March, 2026 | 4:53 PM

నేర నియంత్రణపై దృష్టి సారించాలి

12-03-2026 12:29 AM

డయల్ 100కు వెంటనే స్పందించి బాధితులకు త్వరిత సేవలు అందించాలి

నల్లగొండ టౌన్, మార్చి 11 : జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించి వాటిని సమర్థవంతంగా అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అదికారులకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న నేరాల పరిస్థితి, పెండింగ్లో ఉన్న కేసులు, దర్యాప్తు పురోగతి, కోర్టుల ద్వారా నేరస్తులకు శిక్షలు పడేలా చేపడుతున్న చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలకు పోలీసులు వెంటనే స్పందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా పని చేయాలని సూచించారు. డైల్ 100 కు వచ్చే కాల్స్పై వెంటనే స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.

కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు మరింత పెంచాలని , నేరాల గుర్తింపు విచారణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి కోర్టుల్లో చార్జ్షీట్లు సకాలంలో దాఖలు చేయాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పోలీసు సేవలు అందించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను అమలు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని తెలిపారు. దొంగతనాల నివారణకు పగలు, రాత్రి పెట్రోలింగ్ను మరింత అప్రమత్తంగా నిర్వహించాలని, రౌడీ షీటర్లు, అనుమానితులు, పాత నేరస్థులపై కఠిన నిఘా కొనసాగించాలని సూచించారు.

సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించా రు. అక్రమ గంజాయి రవాణా, జూదం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ ఇసుక రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

బాధితుల గౌరవం, హక్కులను కాపాడుతూ నేరం జరిగిన వెంటనే బాధితులు ఫోన్ ద్వారా లేదా మౌఖికంగా సమాచారం అందిస్తే మహిళలు, చిన్నారులు బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే వారి ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే విధానాన్ని పోలీస్ శాఖ అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు.

మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, ఆస్తి వివాదాలు, పోక్సో చట్టం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాల నిషేధ చట్టం, దొంగతనం, ర్యాగింగ్ నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో ఈ విధానం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్బీ డీఎస్పీ రవి, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.