మే 11 నుండి జిల్లాలో తొలి విడత జనాభా గణన: జిల్లా కలెక్టర్ హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లాలో మొదటి విడత జనాభా గణన ప్రక్రియను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. శనివారం సమీకృత కలెక్టరేట్ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ 2027 మే 11 నుండి జిల్లావ్యాప్తంగా జనాభా గణన ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు 'స్వీయ గణన' అవకాశం కల్పించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సాధారణ ప్రజలు ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలు https://se.census.gov.in పోర్టల్‌లో లాగిన్ అయి సులభంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు.జిల్లావ్యాప్తంగా ఈ ప్రక్రియ నిర్వహణ కోసం మొత్తం 1689 ఇళ్ల బ్లాకులను గుర్తించామని, క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణకు 994 మంది ఎన్యుమరేటర్లను, 174 మంది సూపర్ వైజర్లను నియమించినట్లు కలెక్టర్ వివరించారు. జనాభా గణనపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు చురుకైన పాత్ర పోషించాలని, స్వీయ గణన విధానం అందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.






