13న ఫైర్ స్టేషన్ ప్రారంభం
‘వేం’కృషితో నెరవేరిన ఫైర్ స్టేషన్ కల
కేసముద్రం, జూలై 7 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణానికి నూతనంగా మంజూరైన ఫైర్ స్టేషన్ ను ఈనెల 13న ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక కృషితో ఎన్నో ఏళ్లుగా కేసముద్రం కలగా మారిన ఫైర్ స్టేషన్ కేసముద్రం పట్టణానికి మంజూరయ్యింది.
మహబూబాబాద్ జిల్లా లో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా గుర్తింపు పొందిన కేసముద్రం ప్రాంతంలో వివిధ రకాల పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. అయితే అనేక పర్యాయాలు అగ్ని ప్రమాదాలు సంభవించి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. కేవలం మహబూబాబాద్ పట్టణంలోనే ఫైర్ స్టేషన్ ఉండగా ఇక్కడ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అక్కడి నుండి అగ్నిమాపక యం తం వచ్చేసరికి నేను నష్టం సంభవించేది.
ఈ క్రమంలో వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భావం తర్వాత ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించడం వల్ల మహబూబాబాద్ తర్వాత నియోజక వర్గంలో కేసముద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పా టుకు విశేషంగా కృషి చేశారు. అగ్నిమాపక యంత్రంతో పాటు ఫైర్ ఆఫీసర్ సహా 17 మంది సిబ్బంది, ఒక ఔట్సోర్సింగ్ అటెండర్ పోస్టులను మంజూరు చేయించారు.
ఈ క్రమంలో ఈనెల 13న ఫైర్ స్టేషన్ ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నారు. తాత్కాలికంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పాత మార్కెట్ కార్యాలయంలో అగ్నిమాపక యంత్రం ఏర్పాటు, సిబ్బందికి వసతి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు చేపట్టారు.
కాట్రపల్లి శివాలయం శంకుస్థాపన పనులు
అలాగే చరిత్ర ప్రసిద్ధిగాంచిన కాట్రపల్లి శివాలయం పునరుద్ధరణ పనులను కూడా అదే రోజు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాకతీయుల కాలం నాటి శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నాలుగు కోట్ల రూపాయలను మంజూరు చేయించారు. ఆ నిధులతో ఆలయ పునరుద్ధరణ, ప్రహరీ నిర్మాణం ఇతర సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఆ పనులను కూడా ఈ నెల 13న ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.






