రైతులకు ఇబ్బందులు కలగొద్దు
- విత్తనం నుంచి విపణి వరకు సాఫీగా జరగాలి
- వర్షాలపై ‘ఎల్‌నినో’ ప్రభావం
- ప్రత్యామ్నాయ కార్యాచరణ సిద్ధం చేయండి
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి) : విత్తనం పంపిణీ మొదలు, పంటలు విక్రయించే వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వానాకాలం వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు, ఆయిల్‌పామ్ విస్తరణ, డ్రిప్ పరికరాల సరఫరా, ఎరువుల లభ్యత, మొక్కజొన్న కొనుగోళ్ల చెల్లింపులు, రైతుభరోసా నిధుల జమ, ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుకు ప్రాధాన్యమిస్తుందని, మొక్కల కొరత తలెత్తకుండా, సరఫరాలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసి, నర్సరీల్లో మొక్కలను సిద్దం చేయాలని పేర్కొన్నారు.
డ్రిప్ పరికరాల సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా.. తయారీ, సరఫరా, అమలు సంస్థలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మొక్కలజొన్న రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమ చేయాలని మార్క్‌ఫెడ్ అధికారులకు స్పష్టం చేశారు. రైతులకు అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉంచాలని.. కొరత, రవాణా సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.






