లండన్‌లో అగ్ని ప్రమాదం
ఇందూరు యువకుడి మృతి
నిజామాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): లండన్‌లోని క్రోడియన్ డప్పాస్ హిల్స్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నిజామాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజామాబాద్ నగరంలోని కసాబ్ గల్లికి చెందిన కామినేని సాయి శ్రీకర్(27) బీటెక్ పూర్తిచేసుకుని ఎమ్మెస్ చదివేందుకు లండన్ వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసి, లండన్‌లోని తన స్నేహితుల వద్ద ఉంటూ హోటల్ మేనేజ్‌మెంట్‌లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నా డు. వీరు ఉంటున్న భవనంలోని ఓ గదిలో మంగళవారం అర్ధరాత్రి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి.
రెండవలో అంతస్తులో ఉన్న వారి గదిని కూడా మంటలు అంటుకోవడంతో శ్రీకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో మరో యువకుడు సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ద్వారా తల్లిదండ్రులు ప్రయత్నాలు చేపట్టారు.




