5 July, 2026 | 1:34 AM

కబ్జా కోరలో ఫిరంగి నాలా!

05-07-2026 12:01 AM
  1. నిజాం నాటి చారిత్రక జలసిరి ధ్వంసం
  2. 45 గొలుసుకట్టు చెరువుల ప్రాణాధారం అగమ్యగోచరం 
  3. మురుగుకూపంగా మారిన చారిత్రక జలధార!
  4. కదలని యంత్రాంగం.. తక్షణమే స్పందించాలన్న మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు

రంగారెడ్డి /శంషాబాద్, జూలై 4 (విజయక్రాంతి):ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలోనే, కేవలం గురుత్వాకర్షణ శక్తి  (గ్రావిటీ) ఆధారంగా 45 గొలుసుకట్టు చెరువులను అనుసంధానిస్తూ నిర్మించిన అద్భు త కట్టడం ’ఫిరంగి నాలా’ నేడు కబ్జాకోరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబందహస్తాల్లో చిక్కుకుని కాలగర్భంలో కలిసిపోతోంది.

ఒకప్పుడు నాలుగు నియోజకవర్గాల పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది మం దికి తాగునీరు అందించిన ఈ చారిత్రక సం పదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేస్తూ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. శంషాబాద్ మండలంలోని చౌదర్గూడ, నర్కూడ గ్రామా ల మీదుగా ప్రవహించే ఫిరంగినాలాను స్థానిక జర్నలిస్టులతో కలిసి పరిశీలించారు.

150 అడుగుల నాలా.. 15 అడుగులకు కుంచించుకుని..!

1872లో అప్పటి నిజాం పాలకులు ఈసీ నది వరద నీటిని మళ్లించి, కరవు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు 85 కిలోమీటర్ల పొడవునా, 48 మీటర్ల (దాదాపు 150 అడుగుల) వెడల్పుతో ఈ నాలాను రూపొందించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వల్లి నుంచి ప్రారంభమై శంషాబాద్, మహేశ్వరం మీదుగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వరకు సాగే ఈ నాలా పరిధిలో 81 తూములు, అద్భుతమైన కల్వర్టులు ఉన్నాయి.

అయితే, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర ప్రాం తాలు, ఆదిభట్ల, రావిర్యాల, మంగళ్పల్లి మీ దుగా సాగే ఈ నాలా ఇరువైపులా భారీగా అక్రమ లేఅవుట్లు వెలిశాయి. రియల్ మా ఫియా పంజా విసరడంతో వందేళ్లకు పైగా గంభీరంగా ప్రవహించిన నాలా.. నేడు కబ్జాల కారణంగా కొన్ని చోట్ల కేవలం 15-18 అడుగుల ఇరుకైన మురుగు కాలువలా మారిపోయిందని బక్కని నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు.

జీవో 111 ఉల్లంఘనలు.. పొంచి ఉన్న ముంపు ముప్పు

పర్యావరణ పరిరక్షణ కోసం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జీవో 111 అమల్లో ఉన్నప్పటికీ.. కొందరు అక్రమార్కులు దొడ్డిదారి న అనుమతులు తెచ్చుకుని భారీ కాంక్రీట్ కట్టడాలు నిర్మిస్తున్నారు. స్వచ్ఛమైన ఈసీ న ది జలాలు ప్రవహించాల్సిన నాలాలోకి నే డు ఇండ్ల మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ర సాయనాలు చేరుతుండటంతో ఇది ఒక ప్ర మాదకరమైన మురుగు కాలువలా రూపాంతరం చెందింది. నాలా పూడిక పేరుకుపోవ డం, ప్రవాహ మార్గాలను రియల్టర్లు మూసివేయడంతో స్వల్ప వర్షాలకే శంషాబాద్ పరిసర లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

అధికారులు నిద్రమత్తు వీడాలి: బక్కని

 ‘మన పూర్వీకులు అందించిన సహజ వనరులను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు తీవ్ర అన్యాయం చేసినవాళ్లమవుతాం. అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి, తక్షణమే సర్వే చేపట్టి నాలా హద్దులను నిర్ణయించాలి. అక్రమ కట్టడాలను కూల్చివేసి, ఈ చారిత్రక నాలాకు పూర్వవైభవం తీసుకురావాలి‘ అని డిమాండ్ చేశారు. నీటిపారు దల శాఖ, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే, ఒక అద్భుతమైన జల చరిత్ర శాశ్వతంగా కనుమరు గవడం ఖాయమని హెచ్చరించారు.