బోఫోర్స్ కేసుపై చివరి పిటిషన్ కొట్టివేత
- ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- హిందూజా సోదరుల నిర్దోషిత్వాన్ని సమర్థిస్తూ కేసు ముగింపు
- 4 దశాబ్దాల న్యాయ పోరాటానికి తెర
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఎనభైవ దశకంలో యావత్ దేశ రాజకీయాలను కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం కేసుపై దాఖలైన చివరి పిటిషన్‌ను తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. హిందూజా సోదరులతో పాటు ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీలును జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఏ ఒక్కరికీ క్రిమినల్ శిక్షలు పడకుండానే కేసు అధికారికంగా ముగిసిపోవడం గమనార్హం.
కేసు అధికారికంగా ముగిసినప్పటికీ, భారత రాజకీయ యవనికపై మాత్రం, ఈ వివాదం శాశ్వత ముద్రగా మిగిలిపోయింది. అసలు కేసు నేపథ్యం ఏంటంటే.. 1986 మార్చి నెలలో నాటి భారత ప్రభుత్వానికి, స్వీడన్‌కు చెందిన ఏబీ బోఫోర్స్ కంపెనీకి ఒక రక్షణ (డిఫెన్స్) ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రభుత్వం రూ.1,౪౩౭ కోట్లు అప్పగిస్తే, సందరు కంపెనీ 400 హోవిట్జర్ శతఘ్నులు సమకూర్చాలి. భారత రక్షణ దళాలకు నాణ్యమైన ఆ యుధాలను అందించే ఉద్దేశంతో ఈ ఒప్పందం జరిగింది.
అయితే.. 1987 ఏప్రిల్ 19న ఓ స్వీ డిష్ రేడియో ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఒప్పందం కోసం సదరు కంపెనీ భారత్‌కు చెందిన రాజకీయ ప్రముఖులకు, టాప్ బ్యూరోక్రాట్లకు రూ.౬౪ కోట్ల మేర ము డుపులు అప్పగించిందనేది కథనం సారాంశం. ఈ ఆరోపణలు దేశంలో పెను తుఫాను సృష్టించాయి. నాటి ప్రభుత్వం మొదట ఒక కంపెనీ అనుకుని, చివరి నిమిషంలో స్వీడన్‌కు చెందిన బోఫోర్స్ సంస్థ రూపొందించిన ఫీల్డ్ హోవిడ్జర్ శతఘ్నుల వైపు మొగ్గు చూపడంపై అనుమానాలకు తావిచ్చింది.
రాజీవ్.. ఇమేజ్ డ్యామేజ్
ముడుపుల అంశం నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ వ్యక్తిగత ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నది. ప్ర ధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత, ఆమె తనయుడు రాజీవ్ గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ౪౧౪ స్థానాల్లో విజయం సాధించింది. రాజీవ్ ‘మిస్టర్ క్లీన్’ అనే బిరుదు కూడా ఉండేది. కానీ, బోఫోర్స్ ముడుపుల కేసు తెరపైకి వచ్చాక రాజీవ్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి.
ముడుపుల కేసులో రాజీవ్‌కు అత్యంత సన్నిహితుడైన ఇటలీ వ్యాపారవేత్త ఒట్టావియో ఖత్రోచి పేరు బయటకు రావడం ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నాటి ఆర్థిక, రక్షణ మంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. 1989 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తీసింది. కాంగ్రెస్ పార్టీ బలం 414 నుంచి 197 సీట్లకు పడిపోయింది. వీనీ సింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఏదేమైనా, విభిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కూటమి రాజకీయాల యుగానికి ఈ సంఘటన పునాది వేసింది. ఈ ప్రభుత్వానికి బీజేపీతోపాటు వామపక్షాలు బయటి నుంచి మద్దతు ఇచ్చాయి. ఏకపక్షంగా సాగిన కాంగ్రెస్ ఆధిపత్యానికి బోఫోర్స్ వివాదం ముగింపు పలికింది. మొత్తానికి ఈ పరిణామాలు భారత రక్షణ రంగాన్ని, పార్లమెంట్ వ్యవస్థను స్తంభింపజేశాయి. పార్లమెంటరీ కమిటీ విచారణలు, ఆరోపణల నడుమ ఒక 1989 జూలైలో 100 మందికి పైగా విపక్ష ఎంపీలు ఒకేసారి లోక్‌సభకు రాజీనామా చేశారు. సీబీఐ విచారణలు ఎక్కడ తమను చుట్టుముడతాయోననే భయంతో అధికారులు ఆయుధాల కొనుగోలు నిర్ణయాలు తీసుకునేందుకు సైతం వెనుకాడారు.
ఫలితంగా దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత సైనిక ఆధునీకరణ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అయితే.. 1999లో కార్గిల్ యుద్ధంలో ఈ హోవిట్జర్ శతఘ్నులు ఎత్తున పర్వతాల్లో శత్రువులను చావుదెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించాయి.
మొత్తానికి యుద్ధ రంగంలో అద్భుత ప్రతిభ చూపించిన ఒక ఆయుధం, రాజకీయంగా మాత్రం ప్రభుత్వాన్ని కూల్చేంత తీవ్రస్థాయి తుఫానును సష్టించడం భారత రక్షణ, రాజకీయ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన ఘట్టంగా నిలిచింది. స్కాంను వెలుగులోకి తీసుకువచ్చేందుకు స్వీడన్‌కు చెందిన స్టెన్ లిండ్ స్ట్రోం అనే పోలీస్ అధికారి ఎన్నో వ్యయప్రయాసలకోర్చారు. ఆయనే ముడుపుల గురించి భారత జర్నలిస్టు త్ర సుబ్రహ్మణ్యానికి తెలియజేశారని, ఆమె ముడుపుల అంశాన్ని వెలుగులోకి తెచ్చారని ఇప్పటికీ చెప్తుంటారు.






