8 August, 2026 | 2:05 AM

సాగునీటికి సలహా మండళ్లు

08-08-2026 01:13 AM
  1. తక్షణమే పునరుద్ధరించండి
  2. కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
  3. ఎల్ నినోపై అప్రమత్తం
  4. రైతు ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : ఎల్ నినో నేప థ్యంలో రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, జిల్లా నీటిపారుదల సలహా మండళ్లను తక్షణమే పునరుద్ధరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవా రం మంత్రులు తుమ్మల, జూపల్లి కృష్ణారావు, సీఎస్ సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... ప్రతి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నీటి పారుదల, వ్యవసాయ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సంబంధిత వర్గాలతో కూడిన జిల్లా నీటిపారుదల సలహా మండళ్లు ప్రతి పంట కాలానికి ముందు, పంట సీజన్‌లో తప్పనిసరిగా సమావేశం కావాలని సూచించారు. జలాశయాల్లో నీటి నిల్వలు, నీటి ప్రవాహాలు, స్థానిక వర్షపాతం, తాగునీటి అవసరాలు, కమాండ్ ఏరియాల్లోని సాగు పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి రైతులకు శాస్త్రీయమైన, విశ్వసనీయమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్  నినో పరిస్థితుల దృష్ట్యా వీలైన జిల్లాల్లో రేపటి నుంచే నీటిపారుదల సలహా మండళ్ల ఆధ్వర్యంలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.  ఆగస్టు తొలి వారంలో కురిసిన వర్షాలతో కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఆ వర్షాలను ఆధారంగా చేసుకుని రైతులు వరి సాగుకు వెళ్లడం సముచితం కాదన్నారు.  

నీటి నిల్వలపై అవగాహన కల్పించాలి

రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల ప్రస్తుత పరిస్థితిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదని పేర్కొన్నారు. భవిష్య త్తు అవసరాలకు ఎంత నీటిని నిల్వ ఉంచాలనే అంశాన్ని నిర్ణయించాలని ఆదేశించారు. 

15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త  కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. దాదాపు 16 లక్షల  కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 1.06 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 3.42 కోట్ల మందికి  ప్రతి నెల సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.