30 June, 2026 | 3:53 AM

ఫిల్మ్ ఛాంబర్లు, జనసేన పార్టీ స్పందించాలి

30-06-2026 01:10 AM
  1. తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ 
  2. ‘ఇడుపు కాయితం’ ట్రోల్స్‌పై ఖండన 

తెలంగాణ భాష, యాస, సంస్కృతిని ప్రతిబింబిస్తూ రూపొందుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్‌పై కొంతమంది చేస్తు న్న అవమానకరమైన ట్రోల్స్‌ను తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించింది. ఈ విషయమై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఓ పత్రిక ప్రటకను విడుదల చేసింది. ‘ఒక ప్రాంతీయ భాష, దాని యాస, సంస్కృతిపై ఇలా అపహాస్యం చేయడమనేది కేవలం ఒక సినిమా లేదా టైటిల్‌పై విమర్శ కాదని, అది ముమ్మాటికీ తెలంగాణా గౌరవంపై దాడిగా మేము భావిస్తున్నాం.

తెలంగాణ భాషకు ప్రత్యేకమైన చరిత్ర, గౌరవం, భావోద్వేగం ఉంది. అలాంటి భాషను కించపరచడం అంటే తెలంగాణ తల్లి గౌరవాన్ని అవమానపరచడమే. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను వ్యక్తపరచడం ప్రతిఒక్కరి హక్కే అయినప్పటికీ, అవమానక రమైన, ప్రాంతీయ అసహనాన్ని రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడం అసలు ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి దుర్వ్యవహారాలను సినిమా పరిశ్రమలోని ప్రతిఒక్కరూ ఖండిం చాల్సిన బాధ్యత ఉంది.

ఇప్పటికీ ఈ అంశంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించకపోవడం విచారకరం. సినిమా పరిశ్రమకు మార్గదర్శక సంస్థలైన ఈ రెండు ఛాంబర్లు వెంటనే స్పందించి, తెలంగాణ భాషా గౌరవాన్ని కాపాడే విధంగా స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని మేము విజ్ఞప్తి చేస్తు న్నాం.

అలాగే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, తెలంగాణ జనసేన పార్టీ నాయకత్వం కూడా ఈ అంశంపై స్పందించి, తెలంగాణ భాష, సంస్కృతిని గౌరవించే విధంగా బలమైన సందేశం ఇవ్వాలని కోరుతున్నాం” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై కూడా ఇలాంటి అవమానకరమైన ధోరణులు కొనసాగితే, తెలంగాణ సమాజం పక్షాన నిలబడి, ఇలాంటి సామాజిక దాడులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎప్పటికీ వెనుకాడదని స్పష్టం చేశారు.