చెరువుకట్టపై చెట్ల నరికివేత
కలప అక్రమ రవాణా?
బండచర్లపల్లిలో యథేచ్ఛగా చెట్ల తొలగింపు
ప్రభుత్వ ఆస్తికి రక్షణ ఏది?..
పర్యావరణ పరిరక్షణపై అధికారుల నిర్లక్ష్యం?
సిద్దిపేట రూరల్, ఆగస్టు 21: సిద్దిపేట రూరల్ మండలంలోని బండచర్లపల్లి గ్రామ శివారులో చెరువుకట్టపై చెట్ల నరికివేత వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ పరిధిలోని చెరువుకట్టపై పెరిగిన చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా తొలగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చెట్లను నరికివేసి కలపను తరలిస్తున్న సమయంలో ‘విజయక్రాంతి’ ప్రతినిధి ప్రశ్నించగా, తమకు అనుమతులు ఉన్నాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు? ఏ శాఖ నుంచి జారీ అయ్యాయి? ఎన్ని చెట్లను తొలగించేందుకు అనుమతి ఉంది? అనే ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానం లభించాల్సి ఉంది.
నిబంధనలు ఏమయ్యాయి?
ప్రభుత్వ భూములు, చెరువులు, కట్టలు, శిఖం భూములు, రహదారుల పరిధిలో ఉన్న చెట్లను యథేచ్ఛగా నరికివేయడం సాధ్యం కాదు. సంబంధిత శాఖల అనుమతులు, చెట్ల తొలగింపునకు కారణం, పర్యావరణ పరిరక్షణ చర్యలు వంటి అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెరువుకట్టపై ఉన్న చెట్ల విషయంలో కట్ట భద్రత, నీటి నిల్వ సామర్థ్యం, మట్టి కోతకు అవకాశం, పర్యావరణ ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ‘అనుమతులు ఉన్నాయి’ అనే మాటతో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం సమర్థనీయం కాదని స్థానికులు అంటున్నారు.
కట్ట భద్రతకు ముప్పు..
చెరువుకట్టపై ఉన్న వృక్షాలను విచక్షణారహితంగా తొలగించడం వల్ల కట్టపై మట్టి కోత పెరగడం, వర్షపు నీటి ప్రవాహానికి కట్ట బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో చెట్లను తొలగించడం వల్ల పచ్చదనం తగ్గడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఆస్తి పరిరక్షణతో పాటు పర్యావరణ రక్షణ కూడా అధికారుల బాధ్యతేనని వారు పేర్కొంటున్నారు.
అధికారుల కళ్లముందే కలప తరలింపు జరుగుతోందా?
చెట్ల నరికివేత, కలప తరలింపు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన అధికారులు మౌనం వహిస్తే అక్రమాలకు అడ్డుకట్ట ఎలా పడుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెట్లను నరికివేసి కలప తరలించేందుకు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ అధికారి జారీ చేశారు? అనుమతి పొందిన చెట్ల సంఖ్య ఎంత? నరికివేసిన చెట్ల సంఖ్య ఎంత? తరలిస్తున్న కలపకు సంబంధించిన రికార్డులు ఏమిటి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తీర్మానం చేశాం: పొన్నాల నాగరాజు, సర్పంచ్, బండచర్లపల్లి
గ్రామంలో శ్మశానవాటిక నిర్మించేందుకు అవసరమైన విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు సుమారు 10 చెట్లు నరికివేయాలని తీర్మానించడం జరిగింది. సంబధిత శాఖల అధికారులకు సమాచారం ఇచ్చాం.






