19 June, 2026 | 3:59 PM

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి

19-06-2026 02:36 PM

ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సమితి డిమాండ్ 

షాద్ నగర్,(విజయక్రాంతి): ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న అధిక ఫీజులను తక్షణమే అరికట్టాలని అఖిల భారత విద్యార్థి సమైక్య రంగారెడ్డి జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండల విద్యాధికారి (ఎంఈవో) మనోహర్‌కు జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్, జిల్లా సహాయ కార్యదర్శి ఆకాశ్ నాయక్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్ మాట్లాడుతూ విద్య అనేది హక్కు తప్ప వ్యాపారం కాదన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల ప్రాంగణాల్లోనే నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్న వ్యవహారాన్ని అరికట్టాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై మండల విద్యాధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ నిబంధనల అమలును పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.