12 June, 2026 | 1:22 AM

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

12-06-2026 12:14 AM

విద్యార్థుల నిరసనలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జీఓ ఎంఎస్ 8, 9 ప్రతులను చించి నిరసన వ్యక్తం చేశారు. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణతో కలిసి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.

ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల హక్కు అని, కమిటీలు, జీఓల పేరుతో కాలయాపన చేయకుండా రూ.10 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. బకాయిల కారణంగా కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు.

వేముల రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల బకాయిల కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని, అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉదయనేత, శివకుమార్, వినయ్, రాంబోల్ నాయక్, ప్రవీణ్, హరీష్, రమ్య, వాణి, హరిత, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.