యూట్యూబ్‌లో బర్రెల అమ్మకాల పేరుతో మోసం
సైబర్ నిందితుడి అరెస్ట్.. మరిన్ని జిల్లాల్లోనూ కేసులు
గజ్వేల్, (విజయక్రాంతి): యూట్యూబ్‌లో గేదెలు, బర్రెలు అమ్ముతున్నట్లు తప్పుడు ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరస్థుడిని మర్కూక్ పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ రూరల్ సీఐ డి. రవిరాజు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అమీన్‌పూర్ బీరంగూడకు చెందిన పల్లె సాయికిరణ్ "లక్ష్మీ డెయిరీ ఫార్మ్" పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ గేదెలు, బర్రెల అమ్మకాల వీడియోలు పోస్టు చేసి, అడ్వాన్స్ పేరుతో ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాడు.
మర్కూక్‌కు చెందిన సాయిరెడ్డి శంకర్ రెడ్డి 10 బర్రెల కోసం రూ.2.50 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించగా, నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి గజ్వేల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. దర్యాప్తులో ఇదే తరహాలో నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో కూడా పలువురిని మోసం చేసినట్లు గుర్తించి అట్లు రూరల్ సీఐ రవి రాజు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అమ్మకాల ప్రకటనలను నమ్మే ముందు విక్రేత వివరాలు పూర్తిగా ధృవీకరించుకోవాలని, తెలియని వ్యక్తులకు అడ్వాన్స్‌గా డబ్బులు పంపవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






