14 July, 2026 | 1:31 PM

విద్యార్థుల యూనిఫామ్స్ త్వరితగతిన పూర్తి చేయాలి

14-07-2026 12:26 PM

సదరం ధ్రువపత్రాల జారీలో పారదర్శకత పాటించాలి. 

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్. 

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): మెప్మా మహిళా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేసి, గురుకుల విద్యార్థుల యూనిఫాంల కుట్టు పనులను పరిశీలించారు. జూలై 30లోగా గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, కేజీబీవీలకు యూనిఫాంల పంపిణీ పూర్తి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15లోగా ఏకరూప దుస్తులు అందించాలని ఆదేశించారు. ప్రతి యూనిఫాం విద్యార్థుల కొలతలకు అనుగుణంగా, నాణ్యతతో కుట్టాలని సూచించారు.

మహిళా సంఘాలు సమయపాలనతో పనులు పూర్తి చేసి ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ నిబంధనల మేరకు సదరం ధ్రువపత్రాలు జారీ చేయాలని, అనర్హులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్యాంప్‌కు వచ్చే దివ్యాంగులకు తాగునీరు, వీల్‌చైర్లు, కూర్చునే సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. సదరం ధ్రువపత్రం దివ్యాంగుల సంక్షేమ పథకాల కోసం కీలకమైన పత్రం అని కలెక్టర్ పేర్కొన్నారు.