‘రైతునేస్తం’ కార్యక్రమంలో మంత్రి తుమ్మల.. రైతు సమస్యలపై ఆరా
హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల రైతులతో మంత్రి ఒక్కొక్కరితో నేరుగా మాట్లాడి వారి సాగు పరిస్థితులు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రి తుమ్మల ప్రత్యేకంగా ఆరా తీశారు.
తక్కువ వర్షపాతం దృష్ట్యా నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకునేలా రైతులకు శాస్త్రీయ సలహాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు పంటల ఎంపికపై సరైన సూచనలు అందించేందుకు భూగర్భ జలాల శాఖ, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖల నుంచి క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నీటి లభ్యత, సాగునీటి వనరులు, విద్యుత్ సరఫరా పరిస్థితులను విశ్లేషించి, వాటికి అనుగుణంగా రైతులు ఏ పంటలు సాగు చేయాలో సూచించాలని వెల్లడించారు. నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను ప్రోత్సహిస్తూ, రైతులు అలాంటి పంటలనే ఎంపిక చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.






