14 July, 2026 | 1:31 PM

ఆదాయానికి మించిన ఆస్తులు.. HMDA చీఫ్ ఇంట్లో ఏసీబీ సోదాలు

14-07-2026 12:30 PM

హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

శేరిలింగంపల్లి, జూలై 14(విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Hyderabad Metropolitan Development Authority) చీఫ్ ఇంజనీర్ బి. రవీందర్ (బాచు రవీందర్)పై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రాగా,అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఉదయం నుంచి నానక్ రంగూడాలోని  ఆయన ఇంట్లో భారీ సోదాలు చేపట్టారు.

ఏసీబీ డి.ఎస్‌.పి మజీద్ అలీ ఖాన్ నేతృత్వంలో 15 మంది అధికారుల బృందాలు ఏకకాలంలో రవీందర్ నివాసం, హెచ్‌ఎండీఏ కార్యాలయం, ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీల అనుమానిత ఆస్తులపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన సర్వీస్ కాలంలో అవినీతి, అనుచిత మార్గాల ద్వారా కోట్ల విలువైన ఆస్తులు సంపాదించినట్లు ప్రాథమిక ఆరోపణలు ఉన్నాయి.హైదరాబాద్‌లోని రవీందర్ ఇంటితో పాటు సంబంధిత 12 నుంచి 15 ప్రాంతాల్లో ఏకకాల తనిఖీలు జరుగుతున్నాయి.

సోదాల్లో నగదు, బంగారం నగలు, ఆస్తి పత్రాలు, ఇతర ఆధారాలు లభించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నందున పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.ఇటీవల తెలంగాణలో ఏసీబీ రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్, డి.ఎస్‌.పి భీమ్ రెడ్డి వంటి ఉన్నతాధికారులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో భారీ సోదాలు చేసి అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ కేసు మరో కీలక పరిణామంగా మారింది.ఏసీబీ అధికారులు ఈ కేసులో మరిన్ని ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రవీందర్‌ను అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో హాజరు పరచాలని ఏసీబీ యోచిస్తోంది.ఈ కేసుపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడవ్వనున్నాయి.