రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, మే 11 (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ను కలిసి రైతాంగ సమస్యలపై చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గతంలో బిఆర్‌ఎస్ పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో రైతులు విసిగిపోయారని, ఒక సంచికి నాలుగు కిలోలు అదనంగా తూకం వేసి రైతులను నట్టేట ముంచిన ఉదంతాలు అనేకం చూశామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తప్ప-తాలుతో సంబంధం లేకుండా, కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ప్రతి మండల స్థాయి కొనుగోలు కేంద్రం వద్ద, రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, ప్రతిరోజు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని, డాష్ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
ఇది రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వమని, గడిచిన రెండు సంవత్సరాలలో 1,60,000 కోట్ల బడ్జెట్ను రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టామని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఇన్పుట్ సబ్సిడీ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమం కోసం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. అధికారులు, ప్రభుత్వం బాగా పనిచేసినప్పటికీ రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
అలా ఇబ్బందులు పెట్టిన చోట నేను స్వయంగా వెళ్లి రైతు సోదరులతో కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ 43 కిలోల తూకాన్ని అంగీకరించబోమని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు ఉప్పుల అంజన్ ప్రసాద్, ముత్యం శంకర్, కోల రమేష్, జవ్వాజి హరీష్, తదితరులు ఉన్నారు.






