లింగ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధం
లింగ నిర్ధారణ, లింగ ఎంపికపై కఠిన చర్యలు
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం,(విజయక్రాంతి): గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. పీసీఎన్డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ చర్యలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు చట్టబద్ధమైన నమోదు ద్వారా మాత్రమే నిర్వహించాలని సూచించారు. మొదటిసారి నేరం చేస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారని తెలిపారు. పునరావృతం అయితే ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల వరకు లేదా అంతకుమించి జరిమానా విధిస్తారని వివరించారు. సంబంధిత వైద్యులు, సిబ్బంది చట్టాన్ని ఉల్లంఘిస్తే వారి వైద్య అనుమతిపత్రాన్ని సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేస్తారని పేర్కొన్నారు.




