30 May, 2026 | 5:41 PM

రైతు డిస్కంతో రైతులకు నష్టం

30-05-2026 04:48 PM

- మోటార్లకు మీటర్ పెట్టే రైతు డిస్కంను రద్దు చేయాలి 

- వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి 

- జూన్ 4న రాజీవ్ రహదారి దిగ్బంధం

- గజ్వేల్‌లో బీఆర్ఎస్ హెచ్చరిక

గజ్వేల్: రైతులకు నష్టం చేసే రైతు డిస్కంను వెంటనే రద్దు చేయాలని  బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.

రైతుల బోరు బావులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, రైతు డిస్కంను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేదంటే జూన్ 4న 30 ట్రాక్టర్ల వడ్లతో రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, పంట బోనస్ అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ప్రతాప్ రెడ్డి, రైతుల పక్షాన స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మరో ఉద్యమం చేపడతామని ప్రకటించారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాస శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, కౌన్సిలర్లు బొగ్గుల స్వప్న సురేష్, అతేలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, గోలి మమతా సంతోష్, మరికంటి కనకసేన, మన్నె రూపా వెంకటేష్, కిష్టాపూర్ మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కియోద్దీన్, మాజీ కౌన్సిలర్లు గుంటుకు రాజు, అరికంటి కనకయ్య, శ్యామల మల్లేశం, నాయకులు పాల రమేష్ గౌడ్, స్వామి చారి, అశోక్ రావు, శివకుమార్, కనకరాజు, బిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.