వారం రోజుల్లోగా భగత్ నగర్ దొంగలను పట్టుకోవాలి
లేదంటే సీపీ కార్యాలయం ఎదుట ధర్నా
- ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో శాంతిభద్రతలు మరుగునపడ్డాయని, వరుస దోపిడీలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనమని మాజీ మంత్రి, శాసనసభ్యులు గంగుల కమలాకర్ విమర్శించారు. నగరంలోని భగత్ నగర్ చౌరస్తాలో ఇటీవల దోపిడీకి గురైన మున్నాభాయ్ కుటుంబాన్ని ఆయన శనివారం పరామర్శించారు. జూన్ నెలలోనే తమ కారు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఎమ్మెల్యే గంగుల ఎదుట వాపోయారు. అప్పుడే స్పందించి కారు దొంగలను గుర్తించి ఉంటే, ఇప్పుడు ఈ భారీ దోపిడీ జరిగేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కారు ఎత్తుకెళ్లిన దుండగులే పథకం ప్రకారం ఇంటికి వచ్చి, కుటుంబ సభ్యులపై దాడి చేసి సుమారు 62 తులాల బంగారం, 25 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులు అనుమానిస్తున్న వ్యక్తుల సీసీటీవీ ఫుటేజీ ఫోటోలను అందించినప్పటికీ పోలీసులు నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. నేడు కరీంనగర్ నగరం దోపిడీ దొంగలకు అడ్డాగా మారిందని, దేశవ్యాప్తంగా దొంగల దృష్టి ఈ నగరంపై పడిందంటే అది పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని స్పష్టం చేశారు.
గతంలో పీఎంజే జ్యువెలర్స్‌లో పట్టపగలే తుపాకులతో వచ్చి దోపిడీ చేసిన నిందితులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శించారని, ఇప్పటివరకు సొత్తు రికవరీ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడే దొంగల ఏరివేతపై పోలీసులకు ఉండట్లేదని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వినాయక మండపాల ఏర్పాటును అడ్డుకోవడం, విగ్రహాలు ఎత్తుకెళ్లిన నిందితులను పట్టుకోలేకపోవడం లాంటి ఘటనలు కేవలం కరీంనగర్ పోలీసులకే చెల్లాయన్నారు. గతంలో కరీంనగర్ సేఫ్ నగరంగా ఉండేదని, అర్ధరాత్రి వేళల్లోనూ మహిళలు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఉండేదని, కానీ నేడు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.
దొంగలను వారం రోజుల్లోగా పట్టుకోవాలని, లేనిపక్షంలో సీపీ కార్యాలయం ముందే ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటన పై కరీంనగర్ టౌన్ ఏసీపీకి ఫోన్ చేసి కేసు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, భయాందోళనలో ఉన్న బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ తక్షణమే తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, నాయకులు సుంకిశాల సంపత్ రావు, నేతి రవి వర్మ, మిడిదొడ్డి నవీన్, జిపి స్వామి, తదితరులు పాల్గొన్నారు.






