కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు
భారీగా తరలివచ్చిన భక్తజనం
స్వామివారికి పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ
గణపురం,(విజయ క్రాంతి): కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శనివారం తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రారంభించారు. అనంతరం గణపేశ్వరునికి, నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపురం మండల కేంద్రానికి చెందిన సాయిని శ్రీదేవి రమేష్ దంపతుల కుమార్తె శ్రీ నిత్య జన్మదినం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను, అలంకరణ సామాగ్రిని బహుకరించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయ అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.






