అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు
తెలంగాణ ఉద్యమ తరహాలో రైతు ఉద్యమం
వక్తలు మర్రి వెంకటస్వామి, పోలాడి రామారావు
హుజురాబాద్,(విజయక్రాంతి): అన్నదాతలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తెలంగాణ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారంరైతు ప్రజా సంఘాల సమైక్య ఉమ్మడి జిల్లా నాయకుడు ముచ్చ సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ దీక్షకు హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రైతు, సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలారి రామారావు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. రైతులకు,కౌలు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదలలో ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నించారు. రైతుభరోసా కోసం సమీకరించిన 9000 కోట్ల రూపాయలు నుంచి 4 వేల కోట్ల రూపాయలను కమిషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారని ఆరోపించారు. పంట పెట్టుబడి సాయం కోసం ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదని మరో 15 రోజుల్లో వేసిన పంటలు కోతకు వస్తున్నాయని ఇంకెప్పుడు నిధులు విడుదల చేస్తారని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు నిధులు విడుదల చేయాలని, లేకుంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కనీసం ప్రాజెక్టు నుండి ఏ విధంగా నీళ్లు తీసుకొని వచ్చి రైతుల ఇబ్బందులు తొలగించవచ్చు వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో రాష్ట్ర పాలకులకు సోయిలేకపోవడం దారుణమని అన్నారు. పక్క రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్టాఆని అక్కడ పనితీరును మన పాలకులు చూసి నేర్చుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 28న రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లో లక్ష మందితో రాష్ట్రస్థాయి రైతు మహా గర్జన సభ నిర్వహించినట్లు వారు తెలిపారు. రైతు బీమా బయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు కనీసం 60 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతులకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు 20 లక్షల వరకు ఉత్సవ వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్లను నెరవేర్చకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు స్వామి రెడ్డి, కిషన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, రాంరెడ్డి, తిరుపతి, బుర్ర శ్రీనివాస్, జనార్దన్,స్వామి,సరోజన, లలిత, నాగరాజు, మహేందర్ తో పాటు ప్రజాసంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.




