నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
అక్కేపల్లి చెరువును పరిశీలించిన మంత్రి అడ్లూరి
ధర్మపురి,(విజయక్రాంతి): ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగనీరు అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఇందులో భాగంగా నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ధర్మపురి మండలం లోని అక్కేపల్లి చెరువును మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇరిగేషన్ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమైన అక్కేపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు రోల్లవాగు ప్రాజెక్టు, వెల్గటూర్ ఎత్తిపోతల పథకం, పత్తిపాక రిజర్వాయర్ పనులను పూర్తి చేస్తామని మంత్రి అడ్లూరి వెల్లడించారు. అక్కెపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు నియోజకవర్గంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవడం జరిగిందని, ఇందుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను కలవడం జరిగిందని మంత్రి వివరించారు. ఏడాదిలోపు పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి వివరించారు.ఆయన వెంట జిల్లా గ్రంధాలయ చైర్మెన్ సంఘనబట్ల దినేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సెన్ చిలుముల లావణ్య, పార్టీ మండల అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, సీనియర్ నాయకులు బాదినేని రాజేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






