యూరియా.. ఏదయా..?
దళారుల అక్రమ రవాణా?
కరువైన అధికారుల నిఘా
రాత్రుల్లో ఆటోల్లో రవాణా
జుక్కల్, జూలై 24 (విజయక్రాంతి): వర్షాలు కురిసిన కురువకపోయినా రైతులు మాత్రం ప్రతి సీజన్లో పంటలు వేసుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలకు ఎరువులు అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా జుక్కల్ ప్రాంతంలో యూరియా అధికంగా వాడుతారు. ప్రస్తుతం యూరియా ఏదయా అనే పరిస్థితిలో రైతులు దిక్కుతోచకుండ ఉన్నారు.
సొసైటీలో యూరియా అయిపోగానే రైతులు ఫర్టిలైజర్ షాపులకు ఆశ్రయించారు. అక్కడ కొందరు రైతులకు ఈ యాప్ ద్వారా ఇబ్బందులు తలెత్తడంతో ఆశ్రయించక తప్పడం లేదంటూ వాపోన్నారు. ఇదిలా ఉంటే జుక్కల్ మండల కేంద్రం నుంచి ఆటోల ద్వారా రాత్రి సమయంలో మొస్రా, చందూర్ ప్రాంతాలకు యూరియాను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడికంటే మోసగా చందూర్ ప్రాంతాల్లో వరి అధికంగా పండిస్తారని దళారులు ఇక్కడ డంప్ చేసిన యూరియాను అక్కడికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, కొంతమంది దళారులు యూరియాను పక్క మండలాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పంటల సాగు కీలక దశలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అవసరమైన సమయంలో ఎరువులు అందక పంటల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, యూరియా అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు తగిన తనిఖీలు నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు విమర్శిస్తున్నారు. జుక్కల్ నుంచి మొస్రా వైపు ఆటోల ద్వారా యూరియా తరలింపుపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరుతున్నారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా నిల్వలను అందుబాటులో ఉంచి, అక్రమ విక్రయాలు, వ్యవసాయ శాఖ అధికారులు నిల్వలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, దారులపై ఉక్కు పాదం మోపాలని కోరుతున్నారు.






