11 March, 2026 | 4:36 AM

రైతు భరోసా రాదాయే!

11-03-2026 12:00 AM
  1. అప్పులు తీరేదెలా..?

ఆందోళనలో అన్నదాతలు

కరీంనగర్, మార్చి 10 (విజయ క్రాంతి): రబీ సీజన్ ఆరంభమై వరి పొలాలు పూత దశకు చేరుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అందించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాతకు వెన్నుదన్నుగా నిలవాల్సిన ’రైతు భరోసా’ మాత్రం ఇంకా కాగితాలకే పరిమితమైంది. సాగు ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆచరణలో ముందుకు సాగడం లేదు.

నాట్లు పూర్తయ్యి, ఎరువులు వేసే సమయం వచ్చి నా పైసా విడుదల చేయకపోవడంతో రైతు లు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్ప డం లేదు. గత యాసంగి, మొన్నటి వానాకాలం సీజన్లలోనూ పంట కాలం ముగిసే వరకూ సాయం అందించని సర్కారు, ఇప్పు డు అదే ’జాప్యం’ సంప్రదాయాన్ని కొనసాగిస్తుండటంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సకాలంలో రైతు భరోసా అందకపోవడంతో అప్పులు తీరేదేలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ యాసంగిలో 2.72 లక్షల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కావాల్సి ఉంది.

ఇప్పటికే రైతులు 1,99,032 ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేశారు. మరో 26 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు సాగుతోంది. ఈ నెలాఖరుకల్లా సాగు ప్రక్రియ వంద శాతం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. పంటలు ఏపుగా పెరుగుతున్నా రైతు భరోసా అందకపోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. ఎకరాకు సుమారు 13 వేల రూపాయల వరకు ఇప్పటికే ఖర్చు చేసిన రైతులు, ప్రభుత్వం ఇచ్చే 6 వేల రూపాయల సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పెట్టుబడి సాయం సకాలంలో అందకపోవడంతో జిల్లా రైతాంగంపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.

కేవలం వరి సాగు కోస మే జిల్లా రైతులు ఇప్పటికే 258.74 కోట్ల రూపాయలు, మొక్కజొన్న కోసం 18.20 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ సొ మ్మంతా అధిక శాతం వడ్డీలకు తెచ్చినవే. దుక్కి దున్నడం నుంచి నాట్లు వేయడం వరకు ప్రతి దశలోనూ నగదు అవసరం కా వడంతో రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అ ప్పులు చేశారు. ప్రభుత్వం రైతు భరోసా సకాలంలో అందించి ఉంటే కనీసం ఎరువులు, విత్తనాల ఖర్చులకైనా ఆసరా ఉండేదని, ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ’రైతుబంధు’ పథకం కింద సీజన్ ప్రారంభానికి ముందే నిధులు జమ అయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకం పేరు మార్చినంత వేగంగా, నిధుల విడుదలలో చిత్తశుద్ధి చూ పడం లేదని విమర్శలు వస్తున్నాయి. గత యాసంగిలో జిల్లాలోని 1,65,850 మంది రైతులకు 133.62 కోట్లు, మొన్నటి వానాకాలంలో 1,90,186 మందికి 206.62 కోట్లు అందజేసినా..

అవి పంట చేతికి వచ్చే సమయంలో జమ చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం భరోసా ఇస్తుందా? లేక భారం పెంచుతుందా? అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని గంగాధర మండలం గోపాలరావుపల్లికి వచ్చిన మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు రైతులు మొరపెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతు భరోసా అందించకపోవడంతో అప్పులు చేసి పంటలు వేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పేరు మార్చిన రైతుకు ఒనగూరిన ప్రయోజనం మాత్రం శూన్యం - 

నాటి రైతుబంధు పథకమే నేటి రైతు భరోసా. పేరు మా ర్చిన రైతుకు ఒనగూరిన ప్రయోజనం మాత్రం శూన్యం.  15 వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సుమారు రెండున్నర ఏళ్ళు గడిచినా, ఒక దఫా ఆరువేల రూపాయలు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ప్రస్తు తం రైతు భరోసా అందక వడ్డీలకు తెచ్చి పెట్టుబడి సాయం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

శాతరాజు యాదగిరి, రైతు, కొండపల్కల, మానకొండూరు.

రైతు భరోసా అందక ఇబ్బందులు...

పంటల సాగుకు అవసరమైన పెట్టుబడులు పెట్టి మూడు నెలలు గడిచినా రైతు భరోసా సాయం అందక ఇబ్బందులు పడుతున్నాం. సాగు కోసం అప్పులు తీసుకుని నాటు వేసి పంటలు పెంచుతున్నాం. సంక్రాంతి తర్వాత రైతుబంధు జమ చేస్తామని చెప్పారు.

తరువాత మున్సిపల్ ఎన్నికల తర్వాత 17వ తేదీ లోపు రైతుబంధు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. పంటల కోసం భారీగా పెట్టుబడులు పెట్టి అప్పుల పాలయ్యం. ప్రభుత్వం వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేసి రైతులకు ఉపశమనం కల్పించాలి. సమయానికి సాయం అందితేనే వ్యవసాయం సజావుగా కొనసాగుతుంది.

రాస రత్నాకర్ రెడ్డి, రైతు