ప్రభాకర్‌రావుకు ఊరట
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 10 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంలో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపిం గ్ కేసు విచారణ దాదాపు ముగింపు దశకు చేరుకుందని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలపడం, అలాగే తాను కోర్టు ఆదేశాలను పూర్తిగా పాటించానని, పోలీసుల విచారణకు సహకరించానని ప్రభాకర్ రావు స్పష్టం చేయడంతో.. ధర్మాసనం ఆయనకు ముందస్తు బెయిల్ మం జూరు చేస్తూ తీర్పునిచ్చింది.
త్వరలో ఛార్జిషీట్!
మంగళవారం ఈ కేసు విచారణకు రాగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు దాదాపు పూర్తయిందని, రాబో యే రోజుల్లో ప్రభాకర్‌రావుపై అదనపు ఛార్జిషీట్ దాఖలు చేయనున్నామని ధర్మాసనానికి వివరించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హత కు సంబంధించిన న్యాయపరమైన ప్రశ్నను ఓపెన్‌గా ఉంచుతూనే.. గతంలో కోర్టు ఆయనకు మంజూరు చేసిన మధ్యంతర రక్షణను ఖరారు చేయవచ్చని లూథ్రా కోర్టుకు నివేదించారు.
ప్రభుత్వం, నిం దితుడి వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నిందితుడికి ఇచ్చిన మధ్యంతర రక్షణను ఖరారు చేస్తూ అప్పీల్‌ను పరిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ క్రమంలో గతంలో ప్రభాకర్‌రావుపై ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసిం ది. అక్టోబరులో జరిగిన విచారణలో ఆయన తన ఐక్లౌడ్ పాస్‌వర్డులను రీసెట్ చేయాలని, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోలీసులతో ఆ పాస్‌వర్డు పంచుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అయి తే, అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొందిన సమయంలో ఆయన తన డివైజ్లను ఫార్మాట్ చేశారని, కీలక ఆధారాలను ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. డేటాను ఉద్దేశపూర్వకంగా ముందే నాశనం చేశారని, హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి నదిలో పారేశారని ఆరోపించింది. ప్రభాకర్‌రావు ఐక్లౌడ్ ఖాతాల్లో ఎలాంటి డేటా దొరకలేదని, ఆయన విచారణకు హాజరుకావడానికి ముందే ఆయా ఖాతాల్లో కార్యకలాపాలు జరిగినట్లు యాపిల్ సంస్థ కూడా నిర్ధారించిందని కోర్టుకు తెలిపింది.
ఆయన ఇచ్చిన కొన్ని ఈదూ ఐడీలు ఓపెన్ కాలేదని కూడా సర్కార్ ఆరోపించింది. ప్రభుత్వ ఆరోపణలను ప్రభాకర్‌రావు తరపు న్యా యవాది తీవ్రంగా ఖండించారు. ఎస్‌ఐబీలో ఉండే సమాచారం అత్యంత సున్నితమైనది కావడంతో, అధికారిక ప్రొటోకాల్ ప్రకారం.. రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే డేటాను తొలగించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించి 2023 డిసెంబర్ 2న జరిగిన రివ్యూ కమిటీ సమావేశం మినిట్స్ తన వాదనకు బలాన్నిస్తాయని స్పష్టం చేశారు.
అమెరికాకు చెందిన మొబైల్ నంబర్ డీయాక్టివేట్ కావడం వల్లే, ఒక ఐక్లౌడ్ ఖాతాను రీసెట్ చేయలేకపోయానని వివరణ ఇచ్చారు. ఆ దశలో.. విచారణకు సహకరించనందున కస్టోడియల్ విచారణ కోసం లొంగిపోవాలని సుప్రీం కోర్టు గతంలో ప్రభాకర్‌రావును ఆదేశించింది.
అయితే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పెం డింగ్‌లో ఉంటుందని, అది నిరర్థకం కాదని అప్ప ట్లో స్పష్టం చేసింది. తాజాగా మంగళవారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ పూర్తి కావొచ్చిందని చెప్పడం, ప్రభాకర్‌రావు తాను దర్యాప్తుకు పూర్తిగా సహకరించానని చెప్పడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.




