11 May, 2026 | 5:14 AM

రైతు సంక్షేమమే ధ్యేయం

11-05-2026 12:33 AM

కందుకూరు పీఏసీఎస్ కీలక నిర్ణయాలు

కందుకూరు, మే 9 (విజయక్రాంతి): రైతుల అభ్యున్నతి మరియు సంక్షేమమే ప్రాథమిక లక్ష్యంగా పనిచేస్తామని కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో ) స్పష్టం చేసింది. శనివారం కందుకూరులోని సంఘ కార్యాలయంలో పి.ఐ.సి ఛైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్ అధ్యక్షతన పాలక వర్గ సమావేశం అత్యంత కీలకమైన అంశాలపై చర్చించి, పలు తీర్మానాలను ఆమోదించింది. రైతులకు సాగు ఖర్చుల కోసం అవసరమైన కొత్త రుణాల దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించారు.

సకాలంలో పంట రుణాలు  మరియు దీర్ఘకాలిక రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ అధికారులను ఆదేశించారు.ఈనెల 11వ తేదీ నుండి వరి ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. ప్రభుత్వ మద్దతు ధరతో పంటను సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, మౌలిక సదుపాయాలు కల్పించాలని డైరెక్టర్లు అధికారులకు సూచించారు.అర్హులైన ప్రతి రైతుకూ అండగా.. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి రైతుకు సంఘం ద్వారా అందే సేవల ప్రక్రియను వేగవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది.

ఈ సందర్భంగా ఛైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, సహకార సంఘం అందిస్తున్న రుణ సౌకర్యాలను, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి‘ అని కోరారు. కార్యక్రమంలో పి.ఐ.సి డైరెక్టర్లు సదా పాండురంగారెడ్డి, కొరివి యశోద, తీగల జగదీశ్వర్ రెడ్డి, మేగవత్ చంద్రు నాయక్, నర్ల నరసింహ, గౌర పర్వతాలు, పొట్టి ఆనంద్ మరియు ఇన్-ఛార్జ్ సెక్రటరీ కాలే మహేష్ తదితరులు పాల్గొన్నారు.