10 March, 2026 | 8:31 PM

ఆరెంద జడ్‌పిహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్ వేడుకలు

10-03-2026 06:58 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలం లోని ఆరెంద గ్రామం జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. విద్యార్థులు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈదులపల్లి నరసింహారావు మాట్లాడుతూ... పదవ తరగతి విద్యార్థులు జీవితంలో ఒక ముఖ్యమైన దశలోకి అడుగుపెడుతున్నారని, రాబోయే పబ్లిక్ పరీక్షలను ఎలాంటి భయం లేదా, ఒత్తిడి లేకుండా ధైర్యంగా రాయాలని సూచించారు.

సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పాఠాలను పునరావృతం చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు సాధించగలరని విద్యార్థులను ప్రోత్సహించారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివే అలవాటు ఉంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించడం సాధ్యమవుతుందని‌ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సి.ఆర్‌.పి మల్లన్న మాట్లాడుతూ పదవ తరగతి తర్వాత విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరినప్పుడు మంచి విద్యార్థులుగా గుర్తింపు పొందాలని అన్నారు.

కేవలం చదువు మాత్రమే కాకుండా మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, సమాజానికి ఉపయోగపడే లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు.  పాఠశాలలో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయుల ప్రేమ, మార్గదర్శకత్వం తమ జీవితానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు గుర్తుగా ఒక జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాటలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరించారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.