26 February, 2026 | 5:39 AM

ఫాల్కన్ సీవోవో వికాస్ కుమార్ అరెస్ట్

26-02-2026 02:00 AM
  1. రూ.4,215 కోట్ల భారీ స్కామ్ 

నకిలీ యాప్‌తో 7 వేల మందికి కుచ్చుటోపీ

తక్కువ కాలంలో భారీ వడ్డీలంటూ గాలం

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఊదరగొట్టిన ప్రచారం

సైబరాబాద్ ఈవోడబ్ల్యూ నుంచి కేసుల బదిలీ

రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకున్న సీఐడీ

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): మల్టీ నేషనల్ కంపెనీల పేర్లతో ఫేక్ డీల్స్ సష్టించి, నకిలీ ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా అమాయకులకు వలవేసిన ఫాల్కన్ గ్రూప్ బాగోతం రట్టయింది. అధిక వడ్డీల ఆశచూపి ఏకంగా 7 వేల మందికి పైగా బాధితుల నుంచి రూ.4,215 కోట్లు వసూలు చేసిన ఈ భారీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ స్కామ్‌లో ప్రధాన పాత్ర పోషించిన ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ వికాస్ కుమార్ సఖారే (40)ను తెలంగాణ సీఐడీ బుధవారం అరెస్ట్ చేసింది. హైదర్షాకోట్‌లోని అతడి నివాసంలో అదుపులోకి తీసుకున్న అధికారులు.. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. కాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ముసుగులో నిందితులు ఈ భారీ కుంభకోణానికి తెరతీశారు.

ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ పేరిట ఒక అప్లికేషన్ను డెవలప్ చేశారు. గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో దీనిపై విస్తృతంగా ప్రకటనలు ఇచ్చారు. టెలీకాలర్లను పెట్టి మరీ ప్రచారం చేశారు. తాము ప్రముఖ కార్పొరేట్ కంపెనీలతో వ్యాపారం చేస్తున్నామని నమ్మించేందుకు నకిలీ డీల్స్ సష్టించారు.

తక్కువ కాల వ్యవధిలో కళ్లు చెదిరే లాభాలు, అధిక వడ్డీలు ఇస్తామని ఆశచూపారు. ఇది నిజమేనని నమ్మిన 7,056 మంది అమాయక డిపాజిటర్ల నుంచి ఏకంగా రూ.4,215 కోట్లు వసూలు చేశారు. నకిలీ ఇన్వాయిస్ రశీదులు, అగ్రిమెంట్లు చేతిలో పెట్టి నిలువునా ముంచేశారు. ఇందులో 4,065 మంది బాధితులకు సంబంధించిన సుమారు రూ.792 కోట్లను తిరిగి ఇవ్వకుండా పక్కదారి పట్టించారు.

ఎండీతో కుమ్మక్కైన సీఓఓ

ఈ అక్రమ డిపాజిట్ల దందాకు ఫాల్కన్ గ్రూప్ ఎండీ అమర్దీప్ కుమార్ ఏ-2 ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. ఇతనితో మాజీ సీఓఓ వికాస్ కుమార్ సఖారే ఏ-27, యోగేంద్ర సింగ్ ఏ-4తో పాటు పలువురు కుమ్మక్కయ్యారు. డిపాజిట్లను ఆకర్షించడంలో వికాస్ కుమార్ కీలకంగా వ్యవహరిం చాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుల మేరకు సైబరాబాద్‌లోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీస్ స్టేషన్లో బీఎన్‌ఎస్, టీఎస్పీడీఈఎఫ్ చట్టాల కింద 2025లో మూడు కేసులు నమోదయ్యాయి.

ఈ కుంభకోణం వేల కోట్లలో ఉండటంతో.. తదుపరి దర్యాప్తు కోసం ప్రభుత్వం ఈ కేసులను రాష్ట్ర సీఐడీకి బదిలీ చేసింది. ఈ ఫాల్కన్ గ్రూప్ దాని డైరెక్టర్లపై ఇప్పటికే దేశవ్యాప్తంగా మరో 10 కేసులు నమోదై ఉన్నా యి. ఈ క్రమంలో పక్కా సమాచారంతో దర్యాప్తు వేగవంతం చేసిన సీఐడీ అధికారులు.. హైదరాబాద్లోని హైదర్షాకోట్, లక్ష్మీన గర్ కాలనీలో నివాసం ఉంటున్న వికాస్ కుమార్ సఖారేను బుధవారం అరెస్ట్ చేశా రు. నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్ను సీజ్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

మోసపూరిత యాప్స్‌ను నమ్మొద్దు: సీఐడీ

నమ్మశక్యం కాని రీతిలో తక్కువ వ్యవధిలోనే భారీ లాభాలు, వడ్డీలు ఇస్తామంటూ ఆన్‌లైన్‌లో వచ్చే ఆకర్షణీయమైన స్కీమ్‌లను ప్రజలు ఎవరూ నమ్మొద్దని, కష్టపడి సంపాదించిన డబ్బును ఇలాంటి సైబర్ నేరగాళ్లు, నకిలీ ఆన్లైన్ యాప్లలో పెట్టుబడిగా పెట్టి మోసపోవద్దు అని తెలంగాణ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు.