7 August, 2026 | 5:24 AM

చేనేత మహిళలకు చేయూతనివ్వండి

07-08-2026 01:39 AM
  1. ఆర్థిక, ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలి
  2. పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి) : చేనేత మహిళా కార్మికులకు చేయూతనివ్వాలని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ సూచించారు. చేనేత మగ్గాలపై గంటల తరబడి కూర్చోవడం వల్ల వారు తీవ్రమైన వెన్నునొప్పి, కంటి సమస్యలతో బాధపడుతున్నారని, వీరికి ప్రత్యేక వైద్య సదుపాయాలు అందించాలని కోరారు. టెక్స్‌టైల్స్, హ్యాండ్లూమ్ (చేనేత, జౌళి) రంగాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ కమిటీ ఉన్నత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 

సమావేశంలో చేనేత, జౌళి రంగాల మహిళల సమస్యలపై చర్చించారు. ఆర్థిక, ఆరోగ్య, సామాజిక ఇబ్బందులను కమిటీ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ దళారీల వ్యవస్థను అరికట్టి, మహిళా చేనేత కార్మికులకు నేరుగా మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని, ముడిసరుకుపై రాయితీలు అందించాలన్నారు. 

శ్రమ ను తగ్గించేలా ఆధునిక మగ్గాలు, పరికరాలపై మహిళలకు ప్రత్యేకశిక్షణ ఇవ్వాలన్నాని  కోరారు.   గద్వాల, నారాయణపేట, భూదాన్‌పోచంపల్లి వంటి ప్రాంతాల్లో చేనేతరంగంపై వేలాది మంది మహిళలు ఆధారపడి ఉన్నారని, కేంద్ర, రాష్ట్ర పథకాలు వీరికి అందేలా చూడాలన్నారు.   వీరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు.