3 June, 2026 | 2:12 PM

పారుపల్లి యాతాల చెరువులో సాగునీటి దోపిడీ

03-06-2026 01:55 PM

అక్రమ మోటార్లతో చెరువును ఖాళీ చేస్తున్న అసాంఘిక శక్తులు

వేసవిలో మూగజీవాలకు, రైతులకు తప్పని తిప్పలు

ముత్తారం, జూన్ 03(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లి గ్రామంలోని యాతాల చెరువు నీటిని కొంతమంది అక్రమార్కులు విద్యుత్ తీగలను దొంగతనంగా మార్చి, భారీ మోటార్లతో తోడేస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా చెరువులో ఉన్న కొద్దిపాటి నీరు రైతుల సాగుకు, మూగజీవాల దాహార్తిని తీర్చడానికి ప్రాణాధారంగా మారాయి. అయితే, అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు, ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులోని నీటిని అక్రమంగా తరలిస్తుండటంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అక్రమంగా విద్యుత్తు వైర్లు వేసుకొని

చెరువు నీటిని తోడేందుకు అవసరమైన విద్యుత్తును ప్రభుత్వ లైన్ల నుంచి నేరుగా అక్రమంగా అనుసంధానించుకుని ఈ దందా సాగిస్తున్నారు. విద్యుత్ చౌర్యం జరగడమే కాకుండా, చెరువు అలుగు వద్ద ప్రమాదకరంగా తీగలు వేలాడుతుండటంతో అటుగా వెళ్లే పశువులకు, మనుషులకు ప్రాణాపాయం పొంచి ఉందని, ఒకవైపు ఎండల తీవ్రతతో చెరువులో నీటిమట్టం పడిపోతుంటే, మరోవైపు ఇటువంటి అక్రమ దందాలతో చెరువు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.

ప్రశ్నిస్తున్న రైతులు

ఎండాకాలంలో మా పశువులకు తాగునీరు దొరకడం లేదని. పంట పొలాలకు నీరు అందక ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతున్నారని. ఇటువంటి సమయంలో చెరువులోని నీటిని ఇలా అక్రమంగా తోడేస్తుంటే మా గతేంటని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే అనేకసార్లు ఫిర్యాదు చేసినా, అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని, కఠిన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత నీటిపారుదల శాఖ,  విద్యుత్ శాఖ మరియు మండల రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, అక్రమ మోటార్లను తొలగించాలని, విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, చెరువును కాపాడాలని గ్రామంలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు.